గులాబీ దళంలో పార్లమెంట్ గుబులు మొదలైంది. త్వరలో జరుగనున్న ఈ ఎన్నికలు బీఆర్ ఎస్ పార్టీకి డూ ఆర్ డై గా మారాయనే చెప్పవచ్చు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కారు..సారు..పదహారు అన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లినా ఆశించిన మేర ఆదరణ దక్కలేదు. మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉంటే తెలంగాణ ప్రజలు కేవలం తొమ్మిదింటికే గులాబీ పార్టీని పరిమితం చేశారు. ఇప్పుడు ఏ అధికారం లేకపోవడంతో ప్రజా తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైంది. అయితే కేంద్రంలోనైనా చక్రం తిప్పాలంటే అధిక సంఖ్యలో పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఆ పార్టీ నేతలు మరో మారు తెలంగాణ సెంటిమెంట్ ను ఎత్తుకున్నారు. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలన్న ప్రచారాన్ని ప్రారంభించారు. లేకుంటే నష్టపోతామన్న సంకేతాలిస్తున్నారు. అయితే పార్టీని ప్రజలకు చేరువ చేయాలంటే బీఆర్ ఎస్ గా మార్చిన పార్టీ పేరును తిరిగి టీఆర్ ఎస్ గా మార్చాలన్న డిమాండ్ పార్టీలో రోజు రోజుకూ పెరుగుతోంది. -వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ
జన గళం మేమే.. జన బలం మేమే.. పార్లమెంటులో ఉండాల్సింది గులాబీదళమే అన్న నినాదాన్ని బీఆర్ ఎస్ పార్టీ నేతలు అందుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయినప్పటికీ ప్రజలకు మేమే అండ అని చాటుకోవాలని తపన పడుతున్నారు. తెలంగాణ బలం.. తెలంగాణ గళం.. తెలంగాణ దళం పార్లమెంట్‌లో ఉండాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేకుండా కొట్లాడాలన్నా..అవసర మైతే పేగులు తెగేదాక నిలబడాలన్నా..కలబడాలన్నా అది బీఆర్‌ఎస్‌కి మాత్రమే సాధ్యమంటూ చెప్పుకొస్తున్నారు. అయితే గత లోక్ సభలో తొమ్మిది మందితో గులాబీ బాస్ ఏం సాధించారంటూ జనం ప్రశ్నిస్తున్నారు. మొక్కుబడిగా వినతిపత్రాలు ఇచ్చి మిన్నకున్నార తప్ప కేంద్రాన్ని నిలదీసి ఒక్కటంటే ఒక్క పని చేయించలేకపోయారన్న అపవాదు అందుకున్నారు. లోపాయకారి ములాఖాత్‌లు తప్ప ప్రజలకు ఒరిగిందేవిూ లేదంటున్నారు. అలాంటి వారు మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి ఏం సాధిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజలు వీరిని గెలిపించి..ఓటును దుర్వినియోగం చేసుకోవడం తప్ప చేసేదేవిూ ఉండదంటున్నారు. సొంత పనులు చేసుకోవడం, అధికార దర్పం వెలగబెట్టడమే బీఆర్ ఎస్ నేతలకు తెలుసంటున్నారు.
డూ ఆర్ డై.. భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు డూ ఆర్ డై అనే పరిస్థితిని తీసుకు వచ్చాయి. ఓసారి ఓడిపోయిన వెంటనే ఎన్నికలు ఎదుర్కోవడం ఏ పార్టీకి అయినా కష్టమే. బీఆర్‌ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీకి దాదాపుగా ఇది అసాధ్యమని చెప్పాల్సిందే. అలాంటి పరిస్థితిని ఎదుర్కొని పార్టీని మళ్లీ విజయతీరాలకు చేర్చడానికి ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ సిద్ధమయ్యారు. అయితే ప్రజాదరణ కోల్పోయాక మళ్లీ కల్లబొల్లి కబుర్లు చెబితే ప్రజలు నమ్మరన్నాది వారి ముందున్న అసలు సవాల్. అసెంబ్లీకే బీఆర్‌ఎస్‌ను వద్దనుకున్న ప్రజలు పార్లమెంట్‌కు ఎందుకు ఓటేస్తారన్న సందేహం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
తెలంగాణ సెంటిమెంట్.. గత లోక్ సభలో బీఆర్ ఎస్ నేతలు ఒరగబెట్టిందేమీ లేదనే చెప్పవచ్చు. అందుకే మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ పాచికను ముందుకు తెస్తున్నారు. చివరికి తెలంగాణ బలం, తెలంగాణ గళం, తెలంగాణ దళం బీఆర్‌ఎస్ కాబట్టి ఓటేయాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ వాయిస్ బలంగా వినిపించాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటేయాలంటూ యువరాజు ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో 2014లో జమిలీ ఎన్నికలు జరిగాయి. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకే సారి జరిగాయి. 2018లో కేసీఆర్ ఆరు నెలలు ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లారు. అప్పుడు ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జమిలీగా జరిగితే జాతీయ అంశాల ప్రాతిపదికగా ఓటింగ్ జరుగుతుందని అదే జరిగితే తనకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆయన ముందస్తుకు వెళ్లారు. అసెంబ్లీలో మంచి ఫలితం సాధించారు. రెండోసారి గెలిచిన ఊపులో పార్లమెంట్ ఎన్నికల్లోనూ స్వీప్ చేయవచ్చని అనుకున్నారు. కారు..సారు..పదహారు నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. కానీ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేందుకు ఆసక్తి చూపించలేదు. నాలుగు సీట్లు బీజేపీకి, మూడు సీట్లు కాంగ్రెస్ కు ఇచ్చారు. ఒక సీటు మజ్లిస్ ఖాతాలో జమైంది. అంటే.. బీఆర్‌ఎస్ నెంబర్ 9 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు మరోసారి లోక్ సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.
ప్రతిపక్ష హోదాలో ఎన్నికలకు.. ఈసారి బీఆర్ ఎస్ పార్టీ అధికారంలో లేదు. పరాజయాన్ని ఎదుర్కొని ప్రతిపక్ష పార్టీగా ఎన్నికలకు వెళ్తుంది. ఓ వైపు ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు దూకుడుగా వెళ్తున్న కాంగ్రెస్, మోదీ మానియా ఇంకా ఉందని హడావుడి చేస్తున్న బీజేపీలను తట్టుకోవడం బీఆర్‌ఎస్‌కు అంత సులువు కాదు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా అంగీకరిస్తున్నారు గనకనే.. తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకుంటున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు లేకపోతే తెలంగాణకు ఢిల్లీలో వాయిస్ ఉండదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్ అని జాతీయ పార్టీగా మార్చినందున తెలంగాణ కోసమే కొట్లాడుతామంటే ఇక్కడి ప్రజలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు.
టీఆర్ ఎస్ గా మార్చాలి.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్ సీఎంగా లేనందుకు ప్రజలు బాధపడుతున్నారంటూ కేటీఆర్ చెప్పడం ఆయన అహంకారానికి అద్దం పడుతోంది. నిజానికి ప్రజల సంగతి పక్కన పెడితే కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం బాధపడుతూనే ఉంటారు. తెలంగాణ అన్న పదం తీసేసి భారత రాష్ట్ర సమితి అన్న పేరును పెట్టుకున్నప్పుడే వారికి పేగుబంధం తెగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటు అడగాలనుకున్న కాన్సెప్ట్‌కు.. పార్టీ పేరుకు మ్యాచ్ కావడం లేదు. అసలు ఇలా అడగాల్సి వస్తుందని ఊహించి ఉంటే.. పార్టీ పేరు మార్చి ఉండేవారే కాదేమో.. ! అందుకే ఇప్పుడు మళ్లీ పార్టీని టీఆర్‌ఎస్‌గా మార్చాలన్న డిమాండ్ గులాబీనేతల్లో వ్యక్తమవుతోంది. సెంటిమెంట్లను బలంగా నమ్మే గులాబీ నేతలు దీనిపై కసరత్తు చేస్తారా అన్నది చూడాలి.
నమ్మే పరిస్థితి లేదు.. కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తే కనీసం ఇక్కడ ప్రభుత్వం ఉన్నందున ఉపయోగం ఉంటుంది. బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కనీసం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా అయినా ప్రయోజనం చేకూరుతుంది. ఈ రెండు పార్టీలను కాదని బీఆర్‌ఎస్‌ను గెలిపించడానికి ఉన్న ప్రాతిపదిక ఏదీ లేదనే చెప్పావచ్చు. బీఆర్‌ఎస్‌తో పేరుతో పలు రాష్ట్రాల్లో కాలుమోపిన వారు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడుతారంటే నమ్మశక్యంగా లేదు. తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష అని జాతీయ పార్టీల చేతుల్లోకి తెలంగాణ వెళ్తే ఆగమవుతుందని ఎంతగా చెప్పినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో పట్టించుకుంటారన్న గ్యారంటీ లేదు. అందుకే బీఆర్‌ఎస్ ఆందోళన చెందుతోంది. లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీకి అత్యంత విషమ పరీక్ష. గెలవకపోతే పార్టీని కాపాడుకోవడం కష్టంగా మారుతోంది. అందుకే వదిలేసిన తెలంగాణ సెంటిమెంట్‌తో మరోమారు ప్రజలను మోసం చేసేందుకు బయలుదేరారు.