కులగణనకు అంగీకారం మోదీ భయానికి సంకేతం/Acceptance of caste census is a sign of Modi’s fear
అణగారిన వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకతతోనే అంగీకారం
బీహార్ పర్యటనలో రాహుల్ విమర్శలు
వాయిస్ ఆఫ్ భారత్, పాట్నా : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులగణనకు అంగీకరించడాన్ని తీవ్రంగా విమర్శించిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇది దేశంలోని అణగారిన వర్గాల వ్యతిరేకతతో ప్రధానికి ఏర్పడిన భయాన్ని సూచిస్తున్నదన్నారు. బీహార్ రాష్ట్రంలోని దర్భంగాలో మిథిలా యూనివర్సిటీలో జరిగిన ’శిక్షా న్యాయ్ సంవాద్’కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ప్రధాని మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు:
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వం కేవలం 5శాతం ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, ఇందులో దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలకు ప్రాధాన్యతలేనని అన్నారు. కార్పొరేట్ వ్యాపారవేత్తలకే మద్దతు ఉన్న ప్రభుత్వం ఇది అన్నారు.
కులగణన, రిజర్వేషన్ల డిమాండ్:
దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విధానాలను జాతీయ స్థాయిలో కూడా అమలు చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు. ప్రైవేట్ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీహార్‌లో రాజకీయ వ్యూహాలు:
ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీహార్ యువతను ఆకట్టుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందు భాగంగా ‘శిక్షా న్యాయ్ సంవాద్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు స్థానిక అధికారుల నుంచి తీవ్ర ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. యూనివర్సిటీ గేటులోనే తన కారు నిలిపివేశారనీ, అయినా వెనక్కి తగ్గకుండా నడుచుకుంటూ సభా వేదికకు చేరుకున్నానని పేర్కొన్నారు.
మోదీని గద్దె దించేది ప్రజలే :
“ప్రజల ఆదరణే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఇదే శక్తి మోదీని గద్దె దించుతుంది,” అని ధీమా వ్యక్తం చేశారు. కులగణనకు మోదీ అంగీకారానికి కారణం ప్రతిపక్షాల ఒత్తిడేనని, ఈ సత్యాన్ని దేశ ప్రజలందరూ తెలుసుకోవాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
