ఆసియా మహాకుంభమేళా ‘మేడారం’
జనవరి 28 నుంచి జాతర
కోయ దేవతల వీరగాథ..
చారిత్రక పోరాటమే ఈ వన జాతర
వాయిస్ ఆఫ్ భారత్, మేడారం : తెలంగాణ గడ్డపై మరోసారి కోయ దేవతల కంచు గొంతు మోగనుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో జరిగే అతిపెద్ద ఆదివాసీ జాతర జనవరి 28 నుంచి 31 వరకు అత్యంత వైభవంగా జరగనుంది. తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాల నుంచి సుమారు కోటిన్నర మంది భక్తులు తరలివచ్చే ఈ జాతరకు ఒక గొప్ప చారిత్రక నేపథ్యం ఉంది.
చారిత్రక నేపథ్యం:
కాకతీయులపై ధిక్కార స్వరం12వ శతాబ్దంలో పొలవాసను పాలించే మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క. ఆమెను మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారలమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. తీవ్ర కరువు కాటకాల వల్ల పగిడిద్దరాజు కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడికి కప్పం (పన్ను) కట్టలేకపోయారు. దీనిని రాజ్యాధికారాన్ని ధిక్కరించడంగా భావించిన ప్రతాపరుద్రుడు తన మంత్రి యుగంధరుడితో కలిసి మేడారంపై దండెత్తాడు. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు జరిగిన ఈ భీకర యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, గోవిందరాజులు వీరమరణం పొందారు. తన వారి మరణాన్ని, అవమానాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి ఆ వాగు జంపన్న వాగుగా పిలువబడుతోంది.
సమ్మక్క అదృశ్యం – కుంకుమ భరణి లభ్యం..
యుద్ధ రంగంలో సమ్మక్క కాకతీయ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టింది. శత్రువులు వెన్నుపోటు పొడవడంతో గాయపడిన సమ్మక్క రక్తపు ధారలతోనే చిలుకల గుట్ట వైపు వెళ్లి అదృశ్యమైంది. ఆమెను వెతుకుతూ వెళ్లిన అనుచరులకు ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు గల కుంకుమ భరణి లభించింది. ఆ భరణినే సమ్మక్క రూపంగా భావించి నాటి నుంచి భక్తులు ఆరాధిస్తున్నారు.
మేడారం జాతర 2026 –
28-01-2026 (బుధవారం)కన్నేపల్లి నుంచి సారలమ్మ గద్దెకు రాక. కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగుండ్ల నుంచి పగిడిద్దరాజుల ఆగమనం.
29-01-2026 (గురువారం)చిలుకల గుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపై ప్రతిష్ఠ.
30-01-2026 (శుక్రవారం)భక్తుల మొక్కుల చెల్లింపు. (అమ్మవార్లకు నిలువెత్తు ‘బంగారం’ (బెల్లం) సమర్పణ)
31-01-2026 (శనివారం)దేవతలు తిరిగి వన ప్రవేశం చేయడం
జాతర ప్రత్యేకతలు..
భక్తులు తమ బరువుకు సమానమైన బెల్లాన్ని (బంగారం) అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసులే ఈ జాతరలో పూజారులుగా వ్యవహరిస్తారు. ఇది పూర్తిగా గిరిజన ఆచారాల ప్రకారం జరుగుతుంది. జాతరకు వచ్చే భక్తులు మొదట జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుంటారు.

