ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు/The Adivasis are the original inhabitants of this country
ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి
పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలు.
సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఆలయ అభివృద్ధిపై సమీక్ష

వాయిస్ ఆఫ్ భారత్, ములుగు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవార్లకు 68 కిలోల నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం మేడారంను సందర్శించడం ఇదే మొదటిసారి. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం 12:27 గంటలకు హెలికాప్టర్లో మేడారం చేరుకున్నారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గిరిజన కొమ్ముకోయ నృత్యాలతో, సంప్రదాయ పద్ధతిలో గద్దెల వద్దకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి ఆలయ పూజారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, మరియు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లను వారికి వివరించారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలగకుండానే ఆలయ అభివృద్ధి జరుగుతుందని సీఎం స్పష్టం చేయడంతో, ఆ ప్రతిపాదనలకు వారంతా ఏకీభవించారు.

ఆలయ అభివృద్ధి ప్రణాళికలు..
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మేడారం ఆలయం ప్రకృతి ఒడిలో ఉందని, రాతి కట్టడాలతోనే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. జంపన్న వాగులో నీటి నిల్వ ఉండేలా చెక్‌డ్యామ్‌లు నిర్మించి, ప్రణాళికలు రూపొందించాలని సాగునీటి పారుదల శాఖ అధికారులకు సూచించారు. నిధులు ‘గ్రీన్ ఛానెల్’లో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పనులు పూర్తి చేయించుకునే బాధ్యత అధికారులదేనని తెలిపారు. ఈ పనుల కోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాబోయే వంద రోజులు సమ్మక్క సారలమ్మ మాలధారణ చేసినట్లుగా నిష్టతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
బహిరంగ సభలో సీఎం ప్రసంగం..
అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క, సారలమ్మలని అన్నారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు.
జాతీయ హోదా కల్పించాలి..
కుంభమేళాకు వేల కోట్లు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం, మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మేడారం జాతరను అధికారికంగా నిర్వహించాలనే తమ కోరికను ప్రజా ప్రభుత్వం తీర్చిందని అన్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెలు, ప్రాంగణ పునరుద్ధరణ పనుల డిజైన్లను ఈ సందర్భంగా విడుదల చేశారు.

మంత్రి సీతక్క ప్రసంగం ..
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి స్వయంగా రావడం సంతోషకరమని మంత్రి సీతక్క అన్నారు. ఈ అభివృద్ధి పనులు వెయ్యేళ్లపాటు గుర్తుండిపోయేలా గ్రానైట్ రాయితో నిర్మాణం చేపడతామని తెలిపారు. గతంలో ప్రజల పాలన రావాలని సీఎం మేడారం నుంచి పాదయాత్ర ప్రారంభించారని, తల్లుల ఆశీర్వాదంతోనే అది సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పూజారులు పాల్గొన్నారు.


