అయోధ్యలో మరో కీలక ఘట్టం
- గర్భాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట
- శాస్తోక్త్రంగా జలాభిషేకాల నిర్వహణ
(వాయిస్ ఆఫ్ భారత్, కల్చరల్) ఈ నెల 22న జరగనున్న రామ్‌లల్లా ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. మైసూరుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 ఇంచుల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని వేకువ జామున ఆలయంలోకి తీసుకొచ్చారు. ట్రక్కు ద్వారా తరలించిన ఈ విగ్రహాన్ని క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చారు. కాగా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఏడు రోజుల వైదిక ఆచారాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకురావడానికి ముందే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టలో భాగంగా నాలుగో రోజు శుక్రవారం ఉదయం ఔసదాధివస్, కేశరాధివస్, ఘృతాధివాసం, సాయంత్రం ధాన్యాధివస్మృతి కార్యక్రమాలు జరుగనున్నాయి. శనివారం ఉదయం శర్కరాధివస్, ఫలాధివస్త్రాలు, సాయంత్రం పుష్పాధివాసం నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చివరి రోజైన ఆదివారం సంప్రోక్షణకు ఒకరోజు ముందు ఉదయం మధ్యాధివాసుల క్రతువు, సాయంత్రం శయ్యాధివాసం జరుగుతాయి. ఇదిలావుంటే అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం కోసం యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పల్లె నుంచి పట్టణం వరకు అందరి దృష్టి రామాలయం ప్రారంభోత్సవం విూదనే ఉంది. పవిత్ర దినం జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల విూదుగా రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లోని క్లాక్ టవర్‌పై లేజర్ లైట్ ద్వారా శ్రీరాముడి చిత్రాలను ప్రదర్శించారు. డెహ్రాడూన్‌లో రద్దీగా ప్రదేశంలో ఏర్పాటు చేసిన ఈ లేజర్ షో చూపరులను ఆకట్టుకుంది. శ్రీరాముడి చిత్రాలు మాత్రమే కాకుండా, శ్రీరాముడు సీతమ్మ తల్లితో ఉన్న చిత్రాలు, ఆంజనేయస్వామితో ఉన్న చిత్రాలను క్లాక్ టవర్‌పై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన 47 సెకన్ల వీడియోను ఏఎన్ఐ తన సోషల్ విూడియా ఖాతా ఎక్స్‌లో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
==============
