సమాజానికి తిరిగి ఇవ్వండి/Give back to society
హసన్ పర్తిలో పాఠశాలలు, కాలేజీల అభివృద్ధి
దాతల సాయంతో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఆడీటోరియం ఏర్పాటు
చదువుకు పేదరికం అడ్డు రాదు
కఠోర శ్రమతో ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు
ఎస్పీ చెన్నూరి రూపేష్
“చదువుకు పేదరికం అడ్డు కాదు. దృఢ సంకల్పం, కఠోర శ్రమ ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు” అని ఈగల్ ఎస్పీ, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ అన్నారు. తాను చదువుకున్న హనుమకొండ జిల్లాలోని హసన్‌పర్తి ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలను అభివృద్ధి చేయాలన్న తన సంకల్పం ఈరోజు రూపుదాల్చింది. ‘మహర్షి ఫౌండేషన్’ ద్వారా దాదాపు రూ. 42 లక్షల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక ఆడిటోరియం, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్‌లను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ/ హసన్ పర్తి :
కలెక్టర్ దమయంతి స్ఫూర్తితో ఐపీఎస్ అయ్యాను..
ఈ సందర్భంగా ఐపీఎస్ చెన్నూరి రూపేష్ తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పంచుకున్నారు. “నేను ఇదే పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు, ఒక స్వచ్ఛంద సంస్థ కార్యక్రమానికి అప్పటి కలెక్టర్ దమయంతి మేడం ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమెను చూసి నేను ఎంతగానో స్ఫూర్తి పొందాను. అప్పుడే ఐపీఎస్ కావాలనే లక్ష్యంతో గట్టిగా ప్రయత్నించి, ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను” అని అన్నారు. తాను పొందిన స్ఫూర్తిని ప్రస్తుత విద్యార్థులకు కూడా పంచాలని ఆయన ఆకాంక్షించారు. “నేను పుట్టిన ఊరిని, చదువుకున్న బడిని మర్చిపోకుండా తిరిగి ఏదైనా చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాను. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, నాయకులతో చర్చించి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులపై సలహాలు తీసుకున్నాను. ఆ సలహాల మేరకే ‘మహర్షి ఫౌండేషన్’ పేరుతో నిధులు సేకరించి ఈ నిర్మాణాలు చేపట్టాను” అని రూపేష్ తెలిపారు.

దాతల సహకారం అమోఘం..
ఈ పాఠశాల అభివృద్ధికి పలువురు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చారు. కంప్యూటర్ ల్యాబ్ కు హైదరాబాద్‌లోని బ్లోవ్ చీవ్ టెక్నాలజీ సంస్థ సీఈఓ అరుణ్ స్పాన్సర్ చేశారు. లైబ్రరీ ఏర్పాటుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ డైరెక్టర్లు కె.నిత్యానంద రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, సదానంద రెడ్డి స్పాన్సర్ చేశారు. ఆడిటోరియం నిర్మాణానికి స్వీన్ టర్బిన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. సత్యనారాయణ-అరుణ స్పాన్సర్ చేశారు. ఈ గొప్ప ప్రయత్నానికి సహకరించిన దాతలందరికీ రూపేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ వసతులను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా గత ఏడాది ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించి అభినందించారు.

రూపేష్ సేవలు అభినందనీయం
కలెక్టర్, ఎమ్మెల్యే
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే కే. నాగరాజు ఐపీఎస్ రూపేష్‌ను ప్రశంసించారు. “ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఐపీఎస్ అధికారిగా దేశానికి సేవ చేస్తున్న రూపేష్.. తన స్వగ్రామానికి, చదువుకున్న పాఠశాలకు చేసిన ఈ సేవ ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. పేదరికం నుంచి పైకి వచ్చినప్పుడు సొంత ఊరిని గుర్తుంచుకుని సేవ చేయడం గొప్ప విషయం” అని కొనియాడారు. విద్యార్థుల కోసం దాతలు ముందుకు వచ్చి భవిష్యత్తుకు బాటలు వేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ కార్పొరేటర్ జి. శివకుమార్, డీఐఓ గోపాల్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, కాలేజీ ప్రిన్సిపాల్ సునీత, జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి, సుమ తదితరులు పాల్గొన్నారు.

