శృంగేరి జగద్గురువులకు’గురువందనం’
వేములవాడ రాజన్న క్షేత్రం తరపున కార్యక్రమం
ఘనంగా శ్రీ భారతీ తీర్థ మహాస్వామి జన్మదిన వేడుకలు
దర్శించుకున్న రాజన్న ఆలయ అర్చకులు
వాయిస్ ఆఫ్ భారత్, వేములవాడ : దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధిపతి, జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పక్షాన ఘనంగా ‘గురువందనం’ సమర్పించారు. శృంగేరి క్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో వేములవాడ దేవస్థానం తరపున ఉప ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ కుమార్, అర్చకులు మామిడిపల్లి శరత్ శర్మ పాల్గొన్నారు. జగద్గురువులను దర్శించుకుని, రాజన్న క్షేత్రం తరపున భక్తిపూర్వకంగా మర్యాదలు గావించి, గురువందనం సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసం, ధర్మ ప్రచారం కోసం నిరంతరం కృషి చేస్తున్న జగద్గురువుల ఆశీస్సులు భక్తులందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అత్యంత భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు, పీఠం ప్రతినిధులు పాల్గొన్నారు.
