శిల్ప సౌందర్యానికి ప్రపంచ దర్శనం/ MISS WORLD WARNGAL TOUR

శిల్ప సౌందర్యానికి ప్రపంచ దర్శనం/ MISS WORLD WARNGAL TOUR
###@@@MISS WORLD WARNGAL TOUR ##@@

విశ్వవ్యాప్తం వరంగల్​ జిల్లా ఖ్యాతి
మైమరిపించేలా ఓరుగల్లు అందాలు..
తిలకించేందుకు ప్రపంచ సుందరీమణుల రాక..
కలెక్టర్ల ఆధ్వర్యంలో పకడ్భందీగా ఏర్పాట్లు..
వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ప్రజలు..

             తెలంగాణ గర్వంగా చెప్పుకునే ఓరుగల్లు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. చరిత్ర, శిల్పం, సంస్కృతి మేళవించిన వరంగల్‌ అందాలను తిలకించేందుకు మిస్ వరల్డ్ –2025 అందాల భామలు బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. వరంగల్, ములుగు జిల్లాల్లో పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రజలంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

                                                                                                                                                                    వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక ప్రతినిధి :

ఓరుగల్లు – శిల్పాల శోభ, చరిత్రకీ గౌరవం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమైన వరంగల్ నగరం కాకతీయుల వైభవాన్ని ప్రతిపాదిస్తూ, భవ్యమైన ఆలయాలు, శిల్పకళతో శోభపడే కట్టడాలతో దేశ విదేశాల్లో గుర్తింపు పొందుతోంది. ఈ నగరం కాకతీయ సామ్రాజ్య రాజధానిగా వెలుగొందింది. రామప్ప ఆలయం, వరంగల్ కోట, వేయి స్తంభాల గుడి వంటి చారిత్రక నిర్మాణాలు ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధికెక్కాయి.

వేయి స్తంభాల గుడి – శిల్పకళకు శిఖరం
హన్మకొండలో వెలసిన వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. క్రీ.శ. 1163లో కాకతీయ రాజు రుద్రదేవుని ఆదేశాల మేరకు నిర్మితమైన ఈ దేవాలయం, చాళుక్య శైలిలోనూ, కాకతీయుల శిల్ప నైపుణ్యంతోనూ వెలుగొందింది. నక్షత్రాకార పీఠంపై నిర్మించిన త్రికూటాలయం, సుమారు వేయి స్తంభాలతో కళ్యాణ మంటపంతో ఆకట్టుకుంటుంది. 17 ఏళ్ల విరామం తర్వాత 2024లో ఈ ఆలయాన్ని పునఃప్రారంభించారు.

###@@@MISS WORLD WARNGAL TOUR ##@@
వరంగల్ కోట – కాకతీయుల కళా కీర్తి

క్రీ.శ. 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకూ కాకతీయుల పాలనలో అభివృద్ధి చెందిన వరంగల్ కోట, మూడు వృత్తాకార రక్షణ కంచెలతో, నాలుగు శిల్పతోరణాలతో ఆకర్షణీయంగా నిర్మితమైంది. ఈ కోటను ప్రోల రాజు ప్రారంభించగా, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటి రాజులు అభివృద్ధి చేశారు. కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా గుర్తించింది.

రామప్ప ఆలయం – యునెస్కో గుర్తించిన మణికట్టు
ములుగు జిల్లా, పలంపేట గ్రామంలో ఉన్న రామప్ప ఆలయం (రామలింగేశ్వర ఆలయం), 13వ శతాబ్దంలో కాకతీయ రాజు గణపతిదేవుని సేనాధిపతిగా రేచర్ల రుద్రుడు నిర్మించాడు. శిల్పి రామప్ప పేరుతోనే ఆలయానికి ప్రఖ్యాతి వచ్చింది. 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ఈ ఆలయం, తూర్పు దిశగా నిర్మించిన నక్షత్రాకార పీఠంపై నిలిచిన అద్భుత శిల్పం. ప్రపంచమంతా ఈ ఆలయ నిర్మాణ నైపుణ్యాన్ని ప్రశంసిస్తోంది.

###@@@MISS WORLD WARNGAL TOUR ##@@
ప్రపంచ సుందరీమణుల పర్యటనకు భారీ ఏర్పాట్లు

బుధవారం మిస్ వరల్డ్ పోటీదారుల బృందం వరంగల్, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారు. మొదటి బృందం వేయి స్తంభాల గుడి, వరంగల్ కోటను సందర్శిస్తే, మరో బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప ఆలయాన్ని దర్శించనుంది. వారు పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించి, రాత్రి హరిత హోటల్‌లో భోజనానంతరం హైదరాబాద్‌కు తిరుగుపయనమవుతారు.

‘తెలంగాణ జరూర్ ఆనా’ – ప్రపంచానికి పరిచయం
ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, ‘తెలంగాణ జరూర్ ఆనా’ థీమ్‌తో, రాష్ట్ర వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక శాఖ, కలెక్టర్లు, పోలీస్ శాఖ సమన్వయంతో ఈ పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత, సౌకర్యాల్లో ఎలాంటి లోపం లేకుండా చూసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ పర్యటన ద్వారా కాకతీయుల శిల్ప సౌందర్యం, తెలంగాణ సంపద, చరిత్ర ప్రపంచానికి పరిచయం కానుంది. వరంగల్ ఖ్యాతి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గౌరవాన్ని పొందనుంది. ఇది జిల్లా ప్రజలకు గర్వకారణం మాత్రమే కాదు, తరం తరాల తెలంగాణ సిగలో ఒక చిరస్థాయిగా నిలవబోతోంది.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *