వైభవంగా నగర సంకీర్తన
- ప్రత్యక్షంగా పాల్గొన్న చినజీయర్ స్వామి
వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్) : వికాస తరంగిణి వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమతా దీక్షలో నగర సంకీర్తన కార్యక్రమం త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో వరంగల్ నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం ఆరు గంటలకు వరంగల్ బ్యాంక్ కాలనీలోని డాక్టర్ బచ్చు మురళీకృష్ణ స్వగృహం నుంచి దేశాయిపేటలోని సీకేఎం కళాశాల గ్రౌండ్ వరకు సాగింది. చినజీయర్ స్వామి చిరునవ్వులు చిందిస్తూ భక్తులకు ఆశీర్వచనం అందచేస్తూ ముందుకు సాగారు.
నగర సంకీర్తనలో భక్తబృందాల కోలాటాలు, జై శ్రీమన్నారాయణ, ఓం శ్రీమాతే రామానుజాయ నమః అనే నామస్మరణలతో దేశాయిపేట రహదారి మార్మోగింది. భక్తజనంతో శ్రీమతే రామానుజాయ నమః అనే మంత్రం చెప్పిస్తూ బియ్యపు గింజలను కలశం ద్వారా దారి పొడవునా సేకరిస్తూ యాత్ర కొనసాగింది. పురుషులు తెల్లని దుస్తులు ధరించి జెండాలు, ప్లకార్డులు చేతబూనగా, మహిళలు పసుపు రంగు వస్త్రాలు ధరించి కోలాటాలు ఆడుతూ నగర సంకీర్తనలో ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్గమధ్యలో నాగార్జున స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు స్వామివారికి స్వాగతం పలికారు. చిన్నారులకు సమతా మూర్తి గొప్పతనం గురించి వివరించి ఆశీస్సులు అందచేశారు. అనంతరం సీకేఎం కళాశాల గ్రౌండ్ లో జీయర్ స్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బచ్చు రాధాకృష్ణ, డాక్టర్ బచ్చు మురళీకృష్ణ, శఠకోపాచార్య, దయాకర్ రెడ్డి, తనూజ, వసంత, ఉమ, సుభాష్ రెడ్డి, మురళిలతో పాటు పెద్ద ఎత్తున జీయర్ స్వామి శిష్యులు, వికాస తరంగిణి సభ్యులు పాల్గొన్నారు.

