మేడారం ఆలయ అభివృద్ధిపై సీఎం సమీక్ష/CM reviews development of Medaram temple
ప్రజా ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధం
వాయిస్ ఆఫ్ భారత్, ములుగు : మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి, విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక పూజారులు, గిరిజన సంఘాల ప్రతినిధులు,అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఆదివాసీ సంస్కృతికి ప్రాధాన్యత..
ఆలయ అభివృద్ధి, విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, డిజైన్లను పూజారులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులకు వివరించారు. వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు ప్రాధాన్యత ఇస్తూనే ఆలయ అభివృద్ధి చేపడతామని ముఖ్యమంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనలకు వారంతా ముక్తకంఠంతో ఏకీభవించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా నిర్మాణాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జంపన్న వాగులో నిరంతరం నీరు నిల్వ ఉండేలా సాగునీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని (Dedicated Team) ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి జన్మ ధన్యమవుతుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

