“మెకానికల్ థ్రాంబెక్టమీ” సర్జరీ సక్సెస్/ “Mechanical Thrombectomy” Surgery Success
వస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్
వరంగల్ కు చెందిన సిర్రా సరోజనకు ఆపరేషన్
చికిత్స విజయవంతం కావడంపై పేషంట్ హర్షం
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ: కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టే (బ్లడ్ క్లాట్) వ్యాధికి యశోద ఆసుపత్రిలో చేసే “మెకానికల్ థ్రాంబెక్టమీ” చికిత్స విజయవంతమైందని ఆసుపత్రి వాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం హనుమకొండలోని కాళోజీ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. కాళ్ల నరాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని, అయితే చాలామంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తారని డాక్టర్ ప్రభాకర్ చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సమస్యకు మైక్రో సర్జరీ పద్ధతిలో చిన్న కోత పెట్టి, నరాల్లో పేరుకుపోయిన రక్తం గడ్డలను తొలగించే చికిత్స యశోద ఆసుపత్రిలో అందుబాటులో ఉందని ఆయన వివరించారు. జూన్ 14న రంగశాయపల్లెకు చెందిన 68 ఏళ్ల సిర్రా సరోజన అనే మహిళకు మెకానికల్ థ్రాంబెక్టమీ చేసి, ఆమెను పూర్తి ఆరోగ్యంగా కాపాడగలిగామని తెలిపారు. ఈ వ్యాధి ముఖ్యంగా నిత్యం కూర్చొని ఉండటం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్ల వల్ల వస్తుందని ఆయన చెప్పారు. కాబట్టి క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం, సిగరెట్, మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని సూచించారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స విజయవంతమైన సరోజన మాట్లాడుతూ యశోద ఆసుపత్రిలో చేసిన ఆపరేషన్ తర్వాత తాను ఆరోగ్యంగా ఉన్నానని, తమకు సహకరించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. యశోద ఆసుపత్రి ఇప్పటికే 30కి పైగా ఇలాంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిందని డాక్టర్ ప్రభాకర్ పేర్కొన్నారు.
