ముళ్ల వలయంలో కేసీఆర్
- ఒక్కొక్కటిగా చుట్టు కుంటున్న సమస్యల ముళ్ల వలయం
- మానసిక క్షోభ అనుభవిస్తున్న మహా నేత
- ఒక్కొక్కరు పార్టీ వీడుతున్న వైనం
- కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న లిక్కర్ కేసు
- సైలెంట్ మోడ్ లో కేసీఆర్, కేటీఆర్
వాయిస్ ఆఫ్ భారత్ (పొలిటికల్ న్యూస్, తెలంగాణ) : ఉద్యమ సమయంలోనూ, ముఖ్యమంత్రిగానూ మొత్తం 24 సంవత్సరాల పాటు పులిలా గాండ్రించిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారం పోవడంతోనే పిల్లిలా మారారన్న ప్రచారం సాగుతోంది. కొడుకు కేటీఆర్ అహంకారం, కూతురు కవిత లిక్కర్ స్కాం ఆయనకు మచ్చ తెచ్చిపెట్టాయి. దీనికితోడు వయసుతోపాటు వస్తున్న అనారోగ్య సమస్యలు కేసీఆర్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఉద్యమ సమయంలో జై తెలంగాణ అంటే లక్షల పిడికిళ్లు ఆయనకు బాసటగా నిలిచేవి. నేడు ఆ వేడి, వాడి కనిపించడంలేదు. బహిరంగ సభల్లో ఆయన ప్రసంగం కూడా ప్రజలను ఆకట్టుకోలేకపోతోంది. దీంతో పులి బయటికి వస్తోందంటూ కేసీఆర్ ను ఉద్దేశించి కేటీఆర్ ముందే హింట్ ఇచ్చినా పెద్దగా స్పందన కరువైంది.
పార్టీ వీడుతున్న నేతలు…
ఉచితాలకు ఆశపడి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న ప్రచారం బీఆర్ఎస్ పార్టీ కొంప ముంచుతోంది. త్వరలోనే కాంగ్రెస్ ఖాళీ అవుతుందని, మనదే అధికారం అంటూ గొప్పగా చెప్పుకున్నారు. అయితే కేసీఆర్, కేటీఆర్ లు చేస్తున్న ప్రచారాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం కేసీఆర్ ప్రకటించిన వివిధ పథకాలకు ఆశపడే ఉద్యమ పార్టీని అందళం ఎక్కించామా అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలను చులకన చేస్తూ మాట్లాడుతున్న కేసీఆర్, కేటీఆర్ తగిన గుణపాఠం తప్పదంటున్నారు. అయితే బీఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ను వీడటం కేసీఆర్ ను కలవరపెడుతోంది. స్వంత పార్టీ నుండి చోటామోటా లీడర్లతో పాటు బడా లీడర్లు సైతం ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ లోకి, జాతీయ పార్టీ బీజేపీలోకి వలసపోతుండండంతో ఉన్న పార్టీని ఎలా కాపాడాలో తెలియ ఆయన ఆవేదనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
పోయేటోళ్లు పోనీ.
అధికారం దూరమైతే ఇలాంటి పరిణామాలు ఉంటాయని కేసీఆర్ కు ముందే తెలుసు. అయితే పోయేటోళ్ళు పోనీ, ఉండేటోళ్ళు ఉండని అనేవిధంగా కేసీఆర్ ఉన్నారా? అన్న ప్రశ్న పార్టీలో వినిపిస్తోంది. ఆయన సైలెంట్ మోడ్ లోకి పోవడానికి పవర్ పాలిటిక్సే కారణమా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కేసీఆర్ గురించి తెలిసిన వారు మాత్రం ప్రస్తుతం పార్టీ గురించే కేసీఆర్ ఆలోచిస్తు న్నారంటూ ప్రచారం చేస్తున్నారు. నిజానికి పవర్ పాలిటిక్స్ కూడా ఇలాగే ఉంటాయి. పవర్ ఎటుంటే అటు విపక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్లిపోవడం ఇటీవలి రాజకీయాల్లో సర్వసాధారణంగా మారాయి.
ఓటమిపై విశ్లేషన కరువు..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడంతో బీఆర్ ఎస్ వెనుకబడిందనే చెప్పవచ్చు. అధికారం కోల్పోయి వంద రోజులకు పైగా కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేలా మాట్లాడుతున్నారు తప్ప ప్రజల సింపథిని సంపాదించి ఎలా తిరిగి అధికారంలోకి రావాలన్న ఆలోచనే కేసీఆర్, కేటీఆర్ లలో కనిపించడంలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ గొప్ప అంటూ హెచ్చులకు పోతున్నారు. జరిగిన తప్పులను సరిచేసుకోవడంలేదు. అదేవిధంగా ప్రజాభిమానాన్ని పొందేందుకు ప్రయత్నం చేయడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో బీఆర్ ఎస్ జెండాతో విజయం సాధించిన 39 ఎమ్మెల్యేలను ఐదేళ్లపాటు కాపాడుకోవడం ఆ పార్టీకి కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు అధికార పక్షంపై గొంతు చించుకునేవారే ముందు పార్టీ ఫిరాయించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది.
కేసీఆర్ కు చరమగీతం..
2014లో టీడీపీ, కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి చేర్చుకుని అధికారం సాధించారు. 2018లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి 2018లోనూ ప్రభు త్వం ఏర్పాటు చేశారు. 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లను ఎక్కువమందిని చేర్చుకుని, కాంగ్రెస్పార్టీకి విపక్ష హోదా లేకుండా చేశారు. తన పార్టీ తప్ప వేరే పార్టీ ఉండొద్దు. ప్రశ్నించే విపక్షం ఉండొద్దు అనేవి ధంగా కేసీఆర్ వ్యవహరించారు. మొత్తం ఆధిపత్య మే, అసెంబ్లీలోను అదే ధోరణి ఉండేది. ప్రజలను కలిసేది లేదు. అర్జీలు తీసుకునేది లేదు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయనను కలవడానికి పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. మొత్తం తెలంగాణకే ఆయన పాలన ఆత్మగౌరవ సమస్యగా, పెను సవాల్ అయిపోయిం ది. నెత్తికెక్కించుకున్నవారే 2023 ఎన్నికల్లో నేలకేసి కొట్టారు. కేసీఆర్ సర్కారుకు చరమగీతం పాడి కూల్చేశారు. కాంగ్రెస్ పార్టీకి పాలక పగ్గాలు ఇచ్చారు.
బీఆర్ఎస్ ఖాళీ..
కేసీఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తన పార్టీలో కలిపేసుకున్నారో. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టారు. వంద రోజుల కాంగ్రెస్ పాలన పూర్తి అవగానే ప్రజాస్పందన చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుడు మొదలు పెట్టారు. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు క్యూ కట్టారు. కేసీఆర్ ఏ పని అయితే చేశారో అదే పని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 39 మంది ఎమ్మెల్యేల్లో 20 మంది దాకా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధం అయినట్లు సమాచారం.
కేసీఆర్ పరేషాన్..
అయితే మొత్తానికి బీఆర్ఎస్ తెలంగాణలో ఖాళీ అయిపోతుందా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుతం కేసీఆర్ పార్టీని పట్టించుకునే పరిస్థితులో లేరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూతురు కవిత అరెస్ట్ ను కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమెను బయటికి తీసుకొచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో బీఆర్ ఎస్ నామరూపాలు లేకుండా చేసేందుకు రెండు జాతీయ పార్టీలు పావులు కదుపుతన్నట్లు ప్రచారం సాగుతోంది. నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో, సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ హడావిడి, హంగామా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు అదేమీ కనిపించడం లేదు. అధికారం కోల్పోయిన తరువాత కొద్దిరోజులకే ఆయన సిక్ కావడంతో పాటు ఓటమిపై మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా కట్టి ప్రారంభించిన జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. మొత్తానికి కేసీఆర్, ఆయన పార్టీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడుకు, అటు బీజేపీ దూకుడుకు తట్టుకొని నిలబడుతుందా వేచి చూడాల్సిందే.
