మట్టి కోటను.. మింగేస్తున్నరు
- కోట చుట్టూ అక్రమ నిర్మాణాలు
- భవంతులుగా రూపాంతరం చెందుతున్న గుడిసెలు
- మాయమవుతున్న కాకతీయుల కాలం నాటి కుంటలు
- చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పురావస్తు శాఖ
కలిసొస్తున్న బల్దియా అధికారుల ఉదాసీనత
యునెస్కో గుర్తింపునకు దూరమవుతున్న ఖిలా వరంగల్
ఖిలాలో ఇష్టారాజ్యం పార్ట్-2
తెలంగాణలో గోల్కొండ కోట తర్వాత అంతటి ప్రఖ్యాతి గడించింది ఓరుగల్లు కోట. వరంగల్ మహా నగరం విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో కాకతీయ రాజులు వారి రక్షణ కోసం మట్టికోట, రాతికోట చుట్టూ ఏర్పాటు చేసుకున్న తటాకాలు ప్లాట్లుగా మారాయి. అపేవారు లేకపోవడంతో వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన బల్దియా అధికారుల ఉదాసీనత సైతం అక్రమార్కులకు కలిసొచ్చింది. నిరుపేదలమంటూనే పెద్ద పెద్ద భవనాలను నిర్మించారు. వీటిని అడ్డుకోవాల్సిన పురావస్తు శాఖ అధికారులు నోటీసులిచ్చి వదిలేయడంతో కబ్జా కోరులకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది. అయితే కాకతీయ రాజులు నిర్మించిన ఈ కోట యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలున్నా అక్రమ నిర్మాణాలతో వారసత్వ హోదాకు దూరమవుతోంది. ఇప్పటికైనా బల్దియా, పురావస్తు శాఖ అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి పౌరుషానికి మారుపేరుగా నిలిచిన కాకతీయ రాజుల వీరత్వాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ
తెలంగాణలో గోల్కొండ కోట తర్వాత అంతటి ప్రఖ్యాతి గడించింది ఓరుగల్లు కోట. ఈ కోటలోనే కాకతీయ రాజులు తమ నివాసాలను ఏర్పాటు చేసుకొని రాజ్య పాలన సాగించేవారు. వారి రక్షణకోసం 20 అడుగల ఎత్తులో నాలుగు కిలో మీటర్ల విస్తీర్ణంతో గ్రానైట్ రాళ్లతో రాతి కోట, దాని ఆవల 150 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తులో ఎనిమిది కిలో మీటర్ల విస్తీర్ణంలో మట్టి కోటను నిర్మించారు. మట్టి కోటకు ముందు, వెనుక 18 అడుగుల లోతు కలిగిన తటాకాలను ఏర్పాటు చేసి అందులో మొసళ్లు, విష సర్పాలను వదిలినట్లు చరిత్ర కారులు చెబుతున్నారు. అయితే వరంగల్ మహా నగరం విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో అక్రమార్కులు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చారు. తటాకాలను మాయం చేశారు. మట్టి, రాతి కోట చుట్టూ అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. బల్దియా అధికారులు సైతం ఉదాసీనత ప్రదర్శించడంతో వారి అక్రమాలకు అడ్డూ, అదుపూ లేకుండా పోయింది.
నగర ముంపుకూ ఇదే కారణం..
చిన్నపాటి వర్షానికే నగరంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరడానికి కారణాలను విశ్లేషకులు గుర్తించారు. గతంలో ఖిలావరంగల్ కోట చుట్టూ రక్షణ కవచంగా నీటితో కూడిన అగర్త ఉండేది. వర్షం పడగానే తొలుత ఈ అగర్త నిండేది. మిగిలిన వరద నీరు గొలుసుకట్టు విధానంలో మిల్స్‌కాలనీ మీదుగా కరీమాబాద్ ప్రాంతంలోని కాశికుంట, సాకరాశికుంటలోకి చేరుకునేది. సాకరాశికుంట నుంచి నీరు బొందివాగు నాలా ద్వారా భద్రకాళి చెరువులోకి ప్రవేశించేది. నగర విస్తరణతో క్రమేణా కోట చుట్టూ ఉన్న అగర్త స్థలం, కాశికుంట, సాకరాశికుంట స్థలాల్లో మైసయ్యనగర్, గిరిప్రసాద్‌నగర్, ఏసిరెడ్డినగర్, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, సీఆర్‌నగర్, కాశికుంట, సాకరాశికుంట, లక్ష్మీనగర్ తదితర కాలనీలు వెలిశాయి. సాకరాశికుంట నాలా స్థలం కూడా పలు చోట్ల కబ్జాకు గురి కావడంతో పాటు అక్రమ కట్టడాలు వెలిశాయి. దీంతో వర్షం పడగానే వరద నీరు కాలనీలను ముంచెత్తుతున్నాయి. అగర్త నీరు చేరే అబ్బనికుంట, మంగలికుంట స్థలంలో ప్రస్తుతం అబ్బనికుంట, మంగలికుంట పేరుతో వెలిసిన కాలనిలదీ ఇదే పరిస్థితి.
అధికారుల ఉదాసీనత..
అపురూన, అద్బుత వాస్తు శిల్ప సంపదను, కనువిందు చేసే కళాకృతులను కలిగిన అలనాటి కాకతీయుల ఖిలా వరంగల్ కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలను కలిగి ఉంది. అయినప్పటికీ పురావస్తు శాఖ, వరంగల్ మహా నగర పాలక సంస్థ అధికారుల ఉదాసీనత ఖిలా వరంగల్ ను యునెస్కో గుర్తింపునకు దూరం చేస్తోంది. అక్రమ నిర్మాణాలను బల్దియా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండగా, పురావస్తు శాఖ అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో కళాతోరణాలకు సమీపంలోనే విక్రయ శాలలు, ప్రైవేట్ భవనాలు పుట్ట గొడుగుల్లా వెలుస్తున్నాయి. వందల సంఖ్యలో అక్రమంగా నిర్మితమవుతున్న భవనాలు కాకతీయుల కళావైభవానికి మచ్చ తెస్తున్నాయి. రాజులు పోయారు..రాజ్యాలు పోయాయి.. అదే విధంగా వారి గుర్తులుగా మిగిలిన రాజ ప్రసాదాలు, వాస్తు కళ నైపుణ్యాలు, రాచఠీవికి నిదర్శనాలు, సాంస్కృతిక చిహ్నాలు, దేవాలయాలు, బావులు, తటాకాలు ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. వీటిని రక్షించాల్సిన పాలకులు భక్షకులకు అండగా నిలువడం ప్రమాదకరంగా మారిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే త్వరలోనే కాకతీయుల కళా వైభవం కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని చరిత్రకారులు హెచ్చరిస్తున్నారు.
