మండ మెలిగిన.. సంబురం

మండ మెలిగిన.. సంబురం
  • మేడారం మహా జాతర ప్రధాన ఘట్టానికి శ్రీకారం
  • సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు ప్రత్యేక పూజలు
  • దిష్ఠి తొరణాలు కట్టిన పూజారులు
  • కొత్త వస్త్రాలతో గద్దెల అలంకరణ

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా నిర్వహించే క్రతువుల్లో మరో ప్రధాన ఘట్టానికి శ్రీకారం చుట్టారు. గత వారమే గుడిమెలిగే పండుగతో మేడారం మహాజాతరకు అంకురార్పణ జరుగగా.. బుధవారం ఉదయం మండమెలిగే పండగ నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి సందర్భంగా నిర్వహించిన ఈ మండమెలిగే పండుగతో మేడారం జాతర ప్రారంభమైనట్టేనని భావిస్తుంటారు. ఈ సందర్భంగా మేడారంలో సమ్మక్క తల్లి, కన్నెపల్లిలో సారలమ్మ, పూనుగొండ్లలో పగిడిద్దరాజు, కొండాయిలో గోవిందరాజుల ఆలయాల్లో ఆదివాసీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండమెలిగే పండుగలో భాగంగానే మేడారం పొలిమేరల్లో, ఊరు చుట్టూ మామిడి, తునికి ఆకులతో పూజారులు దిష్టి తోరణాలు కట్టారు. ఊరు చుట్టూ చలిగంజి, అంబలితో కట్టు పోశారు. ఆ తరువాత సమ్మక్క, సారలమ్మకు సంబంధించిన పూజా సామగ్రిని మేడారం గద్దెలపైకి తీసుకొచ్చి పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో పూజలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరించారు. మండమెలిగే పండుగ నుంచి సరిగ్గా వారం రోజులకు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి మేడారం మహాజాతర ప్రారంభం కానుంది.

– వాయిస్ ఆఫ్ భారత్ (కల్చరల్ న్యూస్, మేడారం)

విగ్రహాలు లేని విశిష్టమైన జాతర మేడారం. అడవి తల్లి బిడ్డలకు పట్టం కట్టి ప్రకృతిని పూజించడమే మేడారం జాతర ప్రత్యేకం. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మండమెలిగెతో మరో ప్రధాన ఘట్టానికి బుధవారం శ్రీకారం చుట్టారు. మండమెలిగె పండుగలో భాగంగానే మేడారం పొలిమేరల్లో మామిడి, తునికి ఆకులతో పూజారులు దిష్టి తోరణాలు కట్టారు. ఊరు చుట్టూ తోరణాలు కట్టడంతో ఎలాంటి దుష్ట శక్తులు దరిచేరవని ఇక్కడి పూజారులు, భక్తుల విశ్వాసం. రాత్రి ఊరు చుట్టూ చలిగంజి, అంబలితో కట్టు పోస్తారు. ఆ తరువాత సమ్మక్క, సారలమ్మకు సంబంధించిన పూజా సామగ్రిని మేడారం గద్దెలపైకి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పసుపు, కుంకుమలతో పూజలు చేసి కొత్త వస్త్రాలతో గద్దెలను అలంకరిస్తారు. పూజారులు అక్కడే చలపయ్య మొక్కులు సమర్పిస్తారు.

భక్తులను అనుమతించరు..
చలపయ్య మొక్కులు సమర్పించిన తరువాత పూజారులంతా అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పిస్తారు. పూజా కార్యక్రమాలు పూర్తయిన అనంతరం జాగారాలు కూడా చేపడుతారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు అమ్మవారి గద్దెల వద్దకు భక్తులు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. మండెమెలిగె పండుగతో జాతర ప్రారంభమైనట్టేనని భావిస్తారు. పుట్టమట్టితో అలికి ముగ్గులు కూడా వేస్తారు. సమ్మక్క–సారలమ్మ ఆయుధాలు, గజ్జెలు, కత్తులు, కుంకుమ భరిణెలు, ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేస్తారు. అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుంచి డప్పుచప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ పసుపు, కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడి నుంచి సమ్మక్క గుడికి వెళ్లి గిరిజన ఆడపడుచులు పూజలు చేస్తారు. ఆ తరువాత గ్రామ బొడ్రాయికి శుద్ధ జలంతో అభిషేకాలు చేస్తారు.

చీర, సారె అందజేత..
మండమెలిగె పండుగను పురస్కరించుకొని బుధవారం ఆదివాసి పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో తల్లులకు చీర, సారె, పసుపు, కుంకుమ అందజేయనున్నారు. అనంతరం భక్తిశ్రద్ధలతో గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే బుధవారం ఫిబ్రవరి 21న సారలమ్మ, 22న సమ్మక్క గద్దెలకు చేరుకుంటారని సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. అదే విధంగా 23న మొక్కులు అప్పజెప్పుకోవడం, 24న తిరిగి వన ప్రవేశం ఉంటుందన్నారు.

కోటిన్నర భక్తులు..
ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే మేడారం మహా జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దష్టిలోపెట్టుకొని ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్ర సీతక్క మేడారంలోనే తిష్ఠ వేసి జాతర పనులను పర్యవేక్షిస్తున్నారు. తాగునీరు, మరుగుదొడ్లులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లను కేటాయించిన నేపథ్యంలో పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు. రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతరలో గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రూట్ మ్యాప్ ని సిద్ధం చేయడంతో పాటు, జాతరకు వచ్చే భక్తుల సంఖ్యను బట్టి అందుకు తగిన సౌకర్యాలను కల్పిస్తున్నారు. మరోవైపు మేడారం వెళ్లేందుకు ప్రత్యేక బస్సుల ద్వారా 40 లక్షలమంది భక్తులను తీసుకురావడం లక్ష్యంగా రవాణా శాఖ పనిచేస్తోంది. జాతరకు వారం ముందు నుండే మేడారంలో భక్తుల కోసం 24 గంటల వైద్య సదుపాయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకురానుంది.

జంపన్న వాగుకు లక్నవరం నీరు..
కోటి మందికి పైగా తరలి వచ్చే భక్తులు స్నానమాచరించేందుకు వీలుగా జంపన్న వాగును నీటితో నింపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంగళవారం రాత్రి లక్నవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రెండు, మూడు రోజుల్లో ఈ నీరు జంపన్న వాగుకు చేరుకోనుంది.

Manda Melegina.. Samburam

వన దేవతల జాతరకు రండి..
– గుత్త సుఖేందర్ రెడ్డిని ఆహ్వానించిన సురేఖ

తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు హాజరు కావాల్సిందిగా శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డిని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆహ్వానించారు. బుధవారం హైదరాబాద్ లో శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతల ఆహ్వాన పత్రికతో పాటు మెమెంటో అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *