భేష్ బల్దియా..
- అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్ ట్రీట్ మెంట్
- ఫుట్ పాత్, రహదారుల ఆక్రమణలపై జీడబ్ల్యూఎంసీ నజర్
- జూలు విదిల్చిన అధికారులు
- నోటీసులకు స్పందించకుంటే కూల్చివేతలే..
- మొన్న హనుమకొండలో..నిన్న వరంగల్ లో..
- సర్వత్రా హర్షం
ఇంతకాలం స్థబ్దుగా ఉన్న జీడబ్ల్యూఎంసీ అధికారులు జూలు విదుల్చుతున్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నోటీసులిచ్చినా స్పందించని భవన యజమానుల పని పడుతున్నారు. గ్రేటర్ వరంగల్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా బడా షాపింగ్ మాల్స్, బిల్డింగులను వేటినీ వదలకుండా బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. వారం రోజుల్లో అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సవరణలు చేపట్టకుంటే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు. ఫుట్ పాత్ లు, రహదారుల ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంతకాలం రాజకీయ ఒత్తిళ్లతో కళ్లు, చెవులు మూసుకున్న గ్రేటర్ అధికారులు జనం కోసమే మనం అంటూ వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగిస్తున్నారు. అధికారుల్లో వచ్చిన ఈ మార్పుకు జనం అబ్బురపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అరికడితే నగరంలోని సగం ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటూ సూచిస్తున్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.
– వాయిస్ ఆఫ్ భారత్, స్పెషల్ స్టోరీ
గ్రేటర్ వరంగల్ పరిధిలో మునుపెన్నడూ లేని విధంగా జీడబ్ల్యూఎంసీ అధికారులు అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రహదారులు, ఫుట్ పాత్ లను ఆక్రమించిన చిన్న దుకాణాలు మొదలు బడా షాపింగ్ మాల్స్ వరకు ఎవరినీ వదలకుండా నేలమట్టం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మునిసిపల్ సమస్యలపై దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్ లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. నిబంధనల మేరకు నగరాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. అక్రమ నిర్మాణాలపై ఉపేక్షించేది లేదన్నారు. ప్రభుత్వానికి చెందిన గజం భూమి కూడా ఆక్రమణకు గురి కాకూడదంటూ సూచించారు. అక్రమ నిర్మాణాలపై తమ పని తాము చేసుకోవాలంటూ సూచించారు. మీపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండవంటూ హామీ ఇచ్చారు. నిబంధనలకు అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
అంతా సన్నిహితులే..
గ్రేటర్ పరిధిలోని బడా షాపింగ్ మాల్స్ నిర్వాహకులు, పెద్ద పెద్ద భవనాల యజమానులంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ ఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులకు చెందినవే. వారితో రాసుకొని, పూసుకొని ఉండడంతోపాటు లీడర్లకు ఫైనాన్షియల్ సపోర్టుగా నిలిచినవారే. దీంతో ప్రజలనుంచి ఫిర్యాదులు వెల్లువెత్తినా ఏమీ చేయలేని పరిస్థితి అధికారులది. చర్యలు తీసుకునేందుకు సైట్ మీదకు వెళ్లిన బల్దియా, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వెనక్కి తిరిగి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
నిన్న హనుమకొండలో..
గ్రేటర్ పరిధిలోని కాళోజీ జంక్షన్ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు ఉన్న ఆక్రమణల తొలగింపునకు ఈనెల 10న బల్దియా అధికారులు శ్రీకారం చుట్టారు. పలు బడా షాపింగ్ మాల్స్, కంపెనీ షోరూంలు, హోటల్స్, రెస్టారెంట్ల ఎదుట ఫుట్ పాత్ లపై ఇష్టారీతిన ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో తుక్కుతుక్కు చేశారు. మంగళవారం వరంగల్ చౌరస్తాలోని ప్రముఖ వ్యాపారికి చెందిన వర్ణం షాపింగ్ మాల్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపారు. సిల్ట్ పోర్షన్ పార్కింగ్ గోడలు, హోర్డింగ్స్, బోర్డులను కూల్చివేశారు. ఆక్యుపెన్సీ ప్రకారం అనుమతి తీసుకోనందున విద్యుత్ సరఫరాను తొలగించాలంటూ ఎన్ పీడీసీఎల్ కు లేఖ రాశారు. అనంతరం వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.
కూల్చివేతలే..
బిల్డింగులు, షాపింగ్ మాల్స్ తీసుకున్న పర్మిషన్లు, నిర్మాణాలను బేరీజు వేసుకుని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి బల్దియా అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. విరుద్ధంగా ఉంటే వారం రోజుల్లో సరి చేసుకోవాలని సూచిస్తున్నారు. కాదు..కూడదంటే కూల్చివేతలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట, మడికొండ, నక్కల గుట్ట, అదాలత్, సుబేదారి, నయీంనగర్, కేయూసీ జంక్షన్, కరీంనగర్, స్టేషన్ రోడ్, జేపీఎన్ రోడ్, దేశాయిపేట పరిధిలోని అక్రమ నిర్మాణాలపై త్వరలోనే కూల్చివేతలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు.
ఏనుమాముల 100 ఫీట్ల రోడ్ లో..
బల్దియా పరిధి ఏనుమాముల 100 ఫీట్ రోడ్ ప్రాంతంలో కబ్జా చేసి నిర్మించిన కట్టడాన్ని బల్దియా టౌన్ ప్లానింగ్, డీఆర్ ఎఫ్ విభాగాలు, పోలీసుల సహకారంతో బుధవారం కూల్చివేసినట్లు సిటీ ప్లానర్ వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఏనుమాముల సమీపంలో వంద ఫీట్ ల రోడ్డును ఆక్రమించుకొని అక్రమంగా ఇంటి నిర్మాణం చేసిన యజమానికి నోటీసులు జారీ చేసినప్పటికీ ఎలాంటి వివరణ రాలేదన్నారు. దీనికితోడు ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసుల సమక్షంలో వీడియో రికార్డింగ్ ద్వారా పంచనామా నిర్వహించి కూల్చి వేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీబీఓలు శ్రీకాంత్, నరేందర్, రాజు నాయక్, సంధ్య రాణితో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పన్ను చెల్లించని షాపు సీజ్..
లష్కర్ బజార్ కు చెందిన ఇండియన్ టేర్రైయిన్ నిర్వాహకులు గత రెండు సంవత్సరాలుగా బల్దియాకు పన్నులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేశారని బల్దియా రెవెన్యూ అధికారి యూసుఫోద్దిన్ తెలిపారు. పలు మార్లు పన్ను చెల్లించాలని కోరినా స్పందన లేకపోవడంతో రెడ్ నోటీస్ జారీ చేశామని అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కమిషనర్ ఆదేశం మేరకు అట్టి షాప్ ను సీజ్ చేయడంతోపాటు యజమానికి రూ.80,448 పెనాల్టీ విధించామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ భరత్ చంద్ర, బిల్ కలెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.



