భద్రాద్రి అభివృద్ది ప్రస్తావన వెనక్కి
- ఆలయ విస్తరణ ప్రకటనలతోనే సరి
- మంత్రి తుమ్మలపైనే ఇప్పుడు ఆశలు
(వాయిస్ ఆఫ్ భారత్, కల్చరల్) దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి పుణ్యక్షేత్రం మాస్టర్ ప్లాన్‌కు ఆదిలోనే హంసపాదు ఎదురయ్యింది. యాదాద్రి రతహాలో దీనిని నిర్మిస్తామని ఆనాటి సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇందుకుగాను ఆనాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, త్రిదండి రామనుజ చినజీయర్‌స్వామి పర్యవేక్షణలో భద్రాద్రి ఆలయాభివృద్ధి రూపశిల్పి ఆనంద్‌సాయి ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పుడు సిఎం మారారు. పదేళ్లలో అభివృద్ది గురించి పట్టించుకోలేదు. ఆనాడు మాట ఇచ్చిన తుమ్మల నాగేశ్వర రావు ఇప్పుడుమళ్లీ మంత్రి అయ్యారు. కనుక దీనిపై మంత్రి తుమమల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో అమలైతే ప్రపంచస్థాయిలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భద్రాచలం విరాజిల్లే అవకాశం ఉండేది. కానీ ఎందుకనో దీనికి అడుగు పడలేదు. అప్పట్లో కెసిఆర్ కూడా కేవలం యాదాద్రిపైనే దృష్టి కేంద్రీకరించారు. దీంతో భద్రాద్రితో పాటు, వేములవాడలకు మోక్షం మాత్రం దక్కలేదు. ఆగమ శాస్త్ర ప్రకారం శిల్పకళా నిపుణుల సూచనలతో పూర్తిగా రాతితోనే నిర్మిస్తారని ప్రచారం జరిగింది. యాదాద్రి తరహాలోనే ఇక్కడి శ్రీ రామచంద్రస్వామివారి దేవాలయన్ని గొప్పగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. డెబ్బయి ఎకరాల్లో అభివృద్ధి విస్తరణ పనులకు తెలంగాణ సర్కారు సంకల్పించింది. ఇందులో భాగంగా సొంపైన రెండు ప్రాకారాలు, విశాలమైన మాడ వీధులు, భక్తులకు సవతి సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు ప్రచారం చేశారు. 17వ శతాబ్దంలో రామదాసు ఈ ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఆలయాన్ని ప్రస్తుతం 26వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆలయాన్ని రెండు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తామని అన్నారు. రామదాసు నిర్మించిన ప్రధాన ఆలయం యథాతథంగా ఉంటుందని, ఆళ్వార్ల ఆలయాలను ఉత్తరం, దక్షిణం వైపు నిర్మిస్తారని ప్రకటన చేశారు. లక్ష్మీ అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రాంగణంలో ఉన్న పొగడ చెట్టును కలుపుతూ రామకోటి రాసేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తామన్నారు. స్వామి వారికి ప్రత్యేక వంటశాల, యాగశాల నిర్మిస్తామని తెలిపారు. మాడ వీధుల్లో నిత్యం స్వామివారి సేవలు సాగేలా అభివృద్ధి జరుగుతుందన్నాన్నరు. తిరుపతిలో గతంలో ఉన్న వెయ్యి కాళ్ల మండపం మాదిరిగా నిత్య కల్యాణాలు నిర్వహించేందుకు ప్రత్యేక మండపాన్ని నిర్మిస్తారని ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా సిద్దం అయ్యిందని పలు సందర్భాల్లో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించారు. కానీ పదేళ్లయినా దీని అతీగతీ లేకుండా పోయింది. ఏమయ్యిందో కానీ ఎక్కడా ప్రస్తావన కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు మంత్రి తుమ్మల మళ్లీ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారా..అడుగు ముందుకు పడుతుందా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
