బ్రహ్మకుమారీల స్వర్ణోత్సవం

బ్రహ్మకుమారీల స్వర్ణోత్సవం
  • 6,7 తేదీల్లో వేడుకలు
  • నగరంలో ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు


(వాయిస్ ఆఫ్ భారత్ న్యూస్, కల్చరల్)  ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి విభాగం వరంగల్ నగరంలో ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 6, 7 తేదీల్లో హనుమకొండ హంటర్ రోడ్డులోని ‘డి’ కన్వెన్షన్ లో స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు హనుమకొండ బ్రాంచ్ బాధ్యురాలు ఈశ్వరీయ బ్రహ్మకుమారి విమల ఒక ప్రకటనలో తెలిపారు. 1973 లో ప్రారంభించిన ఈ సంస్థ గడచిన 50 సంవత్సరాలలో అందరి సహకారంతో అభివృద్ధి చెంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 66 శాఖలతో విరాజిల్లుతోందన్నారు. అంకిత భావంతో సేవలను అందించే 130 మంది సమర్పిత అక్కయ్యలతో వేలాదిమంది సభ్యులను కలిగి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజయోగం, మెడిటేషన్, ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత, ఉన్నత, నైతిక విలువలను పెంపొందించి ఆదర్శవంతం అయిన సమాజ నిర్మాణం కొరకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. 6వ తేదీ ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్న స్వర్ణోత్సవాల ప్రారంభ వేడుకల్లో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారన్నారు.

అదే రోజు సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి 8.30గంటల వరకు నిర్వహించే వేడుకల్లో జిల్లాకు చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు పాల్గొంటారన్నారు. ఈ వేడుకల్లో గౌరవ అతిథులుగా మౌంట్ అబూ నుంచి వచ్చిన రాజయోగిని బ్రహ్మకుమారి సంతోష్ దీదీ జి, సుదేశ్ దీదీజి తమ ఆశీస్సులు అందజేస్తారని విమల తెలిపారు. 7వ తేదీ ఉదయం బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పరివారానికి ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీపీఆర్వో కార్యాలయం విశ్రాంత అధికారి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యక్రమాల పట్ల అభిరుచి కలిగిన జి.విధు మౌళి మాట్లాడుతూ ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా 6వ తేదీ సాయంత్రం 5.30 గంటలనుంచి అరగంట పాటు ప్రఖ్యాత ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజుతో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అను అంశంపై ప్రసంగం ఉంటుందన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరిస్తాయనన్నారు. ప్రజలందరూ ఈ స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *