బాలల సంక్షేమ శాఖలో అవకతవకలు/ Irregularities in the Child Welfare Department
కలెక్టర్ దృష్టికి వెళ్లిన ఆరోపణలు
టీఏ పేరుతో రూ.లక్షలు మాయం
దత్తత ప్రక్రియలోనూ అక్రమాలు?
మహిళా ఉద్యోగిపై వేధింపులు
వరంగల్ జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న బాలల పరిరక్షణ విభాగం (సీడబ్ల్యూసీ), చైల్డ్ వెల్ఫేర్ కమిటీలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏప్రిల్ మొదటి వారంలో వచ్చిన ఫిర్యాదులపై కలెక్టర్ ఆదేశాలతో డీటీవో (డిస్ట్రిక్ ట్రెజరీ ఆఫీసర్ ) విచారణ చేపట్టగా, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, విచారణలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఉద్యోగులు ట్రావెల్ చేయకుండా రూ.1,45,110 వరకు టీఏ (ట్రావెల్ అలవెన్స్ ) బిల్లులు పొందినట్లు గుర్తించారు. దీంతో సంబంధిత సిబ్బందికి రికవరీ నోటీసులు జారీ చేశారు. అయితే, ఈ వ్యవహారానికి ప్రధాన కారకుడు అయిన మాజీ డీసీపీఓ (డిస్ట్రిక్ చైల్డ్ ఫ్రొటెక్షన్ ఆఫీసర్ )పై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గత డీసీపీఓ టీఏ మంజూరు పేరుతో ఉద్యోగుల నుంచి పర్సంటేజీగా డబ్బులు తీసుకున్నట్లు, ఇప్పుడు మొత్తం రికవరీ బాధ్యతను సిబ్బందిపైనే నెట్టడం అన్యాయమని వారు వాపోతున్నారు. వారు ఇచ్చిన వివరాల ప్రకారం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సరిగ్గా సమావేశాలు నిర్వహించకపోయినా, నెలకు లక్ష రూపాయల వరకు ప్రభుత్వ నిధులను తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. కమిటీ వద్ద దాదాపు 1,400 కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సంబంధిత రిపోర్టులు, ఆన్‌లైన్ డాక్యుమెంట్లను విచారణ అధికారులు పరిశీలించకపోవడం గమనార్హం.
దత్తత ప్రక్రియలోనూ అక్రమాలు?..
ఇక మరో ఘటనలో, దత్తత కోసం మూడు సంవత్సరాల క్రితం అప్లై చేసిన ఓ మహిళకు పిల్లను ఇవ్వడం పేరుతో గత డీసీపీవో రూ.30,000 డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు, ఆమెపై ఒత్తిడి తేవడానికి స్థానిక అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లను ఉపయోగించారని సమాచారం. బాధితురాలు ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
మహిళా ఉద్యోగులపై వేధింపులు..
మాజీ డీసీపీవో పై మహిళా ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తించినట్లు, అసభ్య పదజాలంతో దూషించాడని ఆరోపణలు ఉన్నాయి. అవుట్ రీచ్ వర్కర్‌గా పనిచేస్తున్న మహిళకు చేసిన అవమానాలపై ఫిర్యాదు వచ్చినప్పటికీ, అధికారుల వైఖరిలో మార్పు కనిపించలేదని సమాచారం.
సీడీపీఓపై కూడా ఆరోపణలు ..
కరీంనగర్ జిల్లా ఆర్జిడీ ఆఫీసులో సూపరింటెండెంట్‌గా పనిచేసిన సమయంలో అధికారిణిపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయని సమాచారం. వర్ధన్నపేట ప్రాజెక్ట్‌లో సీడీపీఓగా పనిచేసిన సమయంలోనూ నల్లబెల్లి అంగన్వాడీ టీచర్ నియామకంలో డబ్బుల లావాదేవీలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదుల నేపథ్యంలో నియామకాన్ని రద్దు చేసినా, ఇప్పటివరకు పునర్నియామకం జరగకపోవడంతో ఆ ప్రాంతంలోని చిన్నారులకు తగిన సేవలు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు.
సమగ్ర విచారణ చేపట్టాలి..
ఈ ఆరోపణలన్నింటిని గమనించి, సంబంధిత శాఖలు పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, బాధితులు కోరుతున్నారు. ముఖ్యంగా, డీసీపీవోపై వచ్చిన ఆరోపణల్ని దృష్టిలో ఉంచుకొని, అతని పాత్రను నిష్పక్షపాతంగా పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సీడీపీఓ వంటి అధికారులపై కూడా చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.
