ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై బండి ఆగ్రహం/Bandi Sanjay’s anger over fee reimbursement arrears
సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ
వాయిస్ ఆఫ్ భారత్, హైదరాబాద్ : తెలంగాణలో విద్యారంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్ల రూ. 8,000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని తీవ్రంగా విమర్శించారు.
ప్రైవేట్ కళాశాలలు ఆర్థికంగా కుదేలు..
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో పలు ప్రైవేట్ డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. అధ్యాపకుల జీతాలు, సిబ్బంది వేతనాలు, కాలేజీల నిర్వహణ ఖర్చులు కూడా భరించలేని స్థితి నెలకొందని, ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలు..
ఫీజులు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కొన్ని కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని నిలిపేశాయి. దీంతో విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి, కొన్ని ఘటనలు పోలీస్ స్టేషన్ల దాకా వెళ్లినట్లు బండి సంజయ్ తెలిపారు.
హామీలను విస్మరించిన సీఎం రేవంత్..
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఫీజు బకాయిలను వన్ టైమ్ సెటిల్‌మెంట్ ద్వారా లేదా 12 వాయిదాల్లో చెల్లిస్తామన్న మాటలు వాయిదాపడ్డాయని బండి సంజయ్ గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాలల నిలకడను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
విద్యారంగంపై ప్రభుత్వ అలసత్వం..
“ప్రభుత్వం అలసత్వంగా వ్యవహరించడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మానసికంగా బాధపడుతున్నారు. విద్యారంగం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని బండి సంజయ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
