జల్‌జీవన్‌తో తీరేనా.. గుక్కెడు నీటి కష్టాలు?

జల్‌జీవన్‌తో తీరేనా.. గుక్కెడు నీటి కష్టాలు?
Will Jaljeevan solve the water woes of Gukkedu?

లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా అందని శాశ్వత పరిష్కారం
2028 వరకు పథకం పొడిగింపు..
రూ. 8.69 లక్షల కోట్లకు చేరిన కేటాయింపులు
వనరుల నిర్వహణలో వైఫల్యం..
భూగర్భ జలమట్టాల పతనంతో ప్రమాద ఘంటికలు

ఏటా వర్షాకాలంలో వరదలు ముంచెత్తడం.. ఎండాకాలం రాగానే మంచినీటి కోసం కటకటలాడటం మన దేశంలో పరిపాటిగా మారింది. ప్రకృతి మనకు జీవనదులు, సహజసిద్ధ వనరులను ప్రసాదించినా, వాటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికీ కొళాయి ద్వారా రక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్‌జీవన్ మిషన్’ గడువును 2028 డిసెంబరు వరకు పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.

                               వాయిస్ ఆఫ్ వందే భారత్, ప్రత్యేక కథనం :

నిధుల పెంపు.. డిజిటల్ పర్యవేక్షణ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ పథకం బడ్జెట్‌ను ఏకంగా రూ. 8.69 లక్షల కోట్లకు పెంచారు. రాష్ట్రాలకు అదనపు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర వాటాను కూడా భారీగా పెంచారు. పథకం అమలును పర్యవేక్షించేందుకు ‘సుజలం భారత్’ పేరుతో డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురానున్నారు. ప్రతి పల్లెను ఒక ‘సుజల గ్రామం’గా తీర్చిదిద్ది, ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నారు. అలాగే ప్రజల్లో అవగాహన కోసం ఏటా ‘జల్ ఉత్సవ’ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

వనరుల వేటలో రాష్ట్రాల నిర్లక్ష్యం
కేంద్రం నిధులు కుమ్మరిస్తున్నా, క్షేత్రస్థాయిలో నీటి వనరులను సమకూర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో దృష్టి సారించడం లేదు. వనరుల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో జల్‌జీవన్ కొళాయిలు ఉన్నా.. అందులో నీళ్లు రావడం లేదు. ఫలితంగా ప్రజలు కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు నగరాల నుంచి పల్లెల వరకు మంచినీటి వ్యాపారం అదుపులేకుండా సాగుతోంది. అనుమతులు లేని ప్లాంట్లు కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి.

పడిపోతున్న భూగర్భ జలాలు
నదుల ద్వారా వేలాది టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా, ప్రజలకు గుక్కెడు స్వచ్ఛమైన నీరు అందించలేని దుస్థితి నెలకొంది. భూగర్భ జలాల వినియోగం మూడింతలు పెరగడం వల్ల నీటి మట్టాలు ప్రమాదకరంగా పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దేశంలోని మూడోవంతు జిల్లాల్లో భూగర్భ జలాలు తాగడానికి పనికిరావని కేంద్రమే అంగీకరించింది.

యుద్ధ ప్రాతిపదికన చర్యలు అవసరం
రాబోయే వేసవిలో నీటి కొరత తీవ్రంగా ఉంటుందని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు తాత్కాలిక పథకాలతో సరిపెట్టకుండా, శాశ్వత నీటి వనరుల కల్పనపై దృష్టి సారించాలి. యుద్ధ ప్రాతిపదికన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటేనే సామాన్యుడి దాహార్తిని తీర్చడం సాధ్యమవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *