చేనేత మగ్గంపై ‘ఆపరేషన్ సింధూర్’/’Operation Sindhur’ on the handloom
సిరిసిల్ల చేనేత కళాకారుడి అద్భుత సృష్టి
బంగారు శాలువాను నేసిన నల్ల విజయ్ కుమార్
చేనేత నైపుణ్యాన్ని చాటిన తీరుపై ప్రశంసల వెల్లువ
7న ప్రధానికి పంపనున్నట్లు విజయ్ వెల్లడి
వాయిస్ ఆఫ్ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ మరోసారి తన చేనేత నైపుణ్యాన్ని చాటారు. ఇటీవల భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో చేపట్టిన సైనిక చర్యలకు ప్రశంసగా, అగ్గిపెట్టెలో ఇమిడిపోయేలా బంగారు పోగుల శాలువాను రూపొందించి అబ్బురపరిచారు. ‘ఆపరేషన్ సిందూర్’ స్ఫూర్తితో ప్రత్యేకంగా రూపొందించిన ఈ శాలువాను విజయ్ కుమార్ చేనేత మగ్గంపై గురువారం నేశారు. ఈ శాలువా రెండు మీటర్ల పొడవు, 36 అంగుళాల వెడల్పుతో, కేవలం 80 గ్రాముల బరువుతో ఉంది. దీన్ని నేయడానికి రెండు గ్రాముల బంగారు పోగులు, పట్టు జరీ నూలు ఉపయోగించారు. చేనేత కళాకారుడి నైపుణ్యానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.
ఈ సందర్భంగా నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశ రక్షణ కోసం సైనికులు చేస్తున్న సేవలకు తమ చేనేత కళ ద్వారా నివాళి అర్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రత్యేకమైన శాలువాను ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. సిరిసిల్ల నేత కళాకారులు సాధించిన మరో గొప్ప విజయంగా ఈ సృష్టి నిలిచింది.
