కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్
19న నిరసనను జయప్రదం చేయండి
వాయిస్ ఆఫ్ భారత్, వరంగల్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను నిరసిస్తూ ఈనెల 18, 19న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని కమ్యూనిస్టు పార్టీల పిలుపు మేరకు వరంగల్ జిల్లా కమ్యూనిస్టు, విప్లవ పార్టీల సమావేశం సోమవారం శివనగర్ సీపీఐ తమ్మర భవన్ లో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ గతంలో మాదిరిగానే మోడీ ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ లో కేటాయింపులు చేయకుండా ఇంకా తగ్గించి సంపన్నులకు రాయితీలు కల్పించిందని, ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర లేదు భారత ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ పూర్తిగా ప్రైవేటీకరణ చేయడం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడం, వైద్య, విద్యా రంగాలకు రంగాలను నిర్లక్ష్యం చేయడం ప్రజా పంపిణీ వ్యవస్థకు సబ్సిడీలు తగ్గించడం మొదలగు ప్రజా ద్రోహ విధానాలను మోడీ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిందని వారు ఆరోపించారు. దేశంలోని 200 మంది శత కోటీశ్వరులపై సంపద పన్ను ప్రవేశపెట్టాలని, కార్పొరేట్ సంస్థలపై పన్ను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 19న వరంగల్ హెడ్ పోస్టాఫీస్ సెంటర్ లో ఉదయం 11 గంటలకు జరిగే నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నలిగంటి రత్నమాల, ఎంసీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నర్రా ప్రతాప్, సీపీఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కినపల్లి యాదగిరి, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి వల్లందాస్ కుమార్, ఎస్ యూసీఐ(సీ) నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
