ఐక్యతతోనే పద్మశాలీల అభ్యున్నతి/The progress of Padmashalis is only possible through unity.
ఘనంగా పద్మశాలి పరపతి సంఘాల సమావేశం
హాజరైన సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు
సంస్కృతి వికాసం, కార్తీకమాస వనభోజనాలపై చర్చ
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ: పద్మశాలీలు అందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఐక్యతతోనే కుల అభివృద్ధి సాధ్యమని ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ పిలుపునిచ్చారు. శక్తివంతమైన పద్మశాలి సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. హనుమకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీలో శ్రీ భక్త మార్కండేయ సేవా సంఘం అధ్యక్షుడు వైద్యం రాజగోపాల్ అధ్యక్షతన నిర్వహించిన హనుమకొండ జిల్లా, పట్టణ పద్మశాలీ పరపతి సంఘాల ప్రత్యేక సమావేశానికి 30 సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశం జై మార్కండేయ, జై పద్మశాలి నినాదాలతో హోరెత్తింది. భవిష్యత్ కార్యాచరణపై పలు తీర్మానాలను ఆమోదించారు. స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంత సెప్టెంబర్ 27న 500 మందితో ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కార్తీక మాస వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించాలని తీర్మానించారు. మార్కండేయ జయంతి, జంజనపూర్ణిమ, ఇతర పండుగలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఒక ప్రముఖ కూడలిలో స్థలం కేటాయించి, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని నెలకొల్పాలని తీర్మానించారు. ప్రతినెల 15వ తేదీన సమావేశమై అన్ని కార్యక్రమాలను సమన్వయం చేసే బాధ్యతను వైద్యం రాజగోపాల్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని తయారు చేయించి ఇస్తానని కొత్తూరు పరపతి సంఘం అధ్యక్షుడు తౌటం విజేందర్ ప్రకటించారు. కార్తీక మాస వన భోజనాలకు ఫామ్ హౌస్‌ను ఏర్పాటు చేస్తామని రెడ్డి కాలనీ పరపతి సంఘం అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు తెలిపారు. అలాగే, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఏర్పాటుకు రెవెన్యూ కాలనీ అధ్యక్షుడు రాజేశం ముందుకు వచ్చారు. విగ్రహం దాత లభించినందున, విగ్రహ స్థాపనకు స్థలం కేటాయించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజ్ ను కోరుతూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా దాతలకు ధన్యవాదాలు తెలిపి, సంఘాల అధ్యక్షులకు మార్కండేయ ఫోటోను జ్ఞాపికగా అందజేశారు.

పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలి..
ఈ సందర్భంగా ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ, భవిష్యత్తులో పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని, అన్ని రంగాల్లో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథులుగా హాజరైన వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్ గడ్డం కేశవమూర్తి మాట్లాడుతూ, పద్మశాలీలు ఆర్థికంగా, అన్ని రంగాల్లో పరిణతి చెందినా, నవ సమాజ నిర్మాణం కోసం ముందుకు రావడం లేదని అన్నారు. పద్మశాలీల అభివృద్ధికి, రాజకీయ ఎదుగుదలకు ఐక్యంగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందని వారు నొక్కి చెప్పారు. ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా తమ సామాజిక వర్గం అభ్యర్థిని నిలబెడితే గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు, అఖిల భారత గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బొద్దుల వెంకటేశ్వర్లు, జిల్లాలోని పరపతి సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.


