ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంపై బీజేపీ కక్షసాధింపు
ఎమ్మెల్యేలు నాయిని, కేఆర్ నాగరాజు ధ్వజం
వాయిస్ ఆఫ్ భారత్, హనుమకొండ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ (ఉపాధి హామీ) పథకాన్ని నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇది పేదలపై కక్షసాధింపు చర్య అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హనుమకొండ డీసీసీ భవన్‌లో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు, శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య కూడా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని అడ్డుకోవడం పేదల పాలిట శాపంగా మారుతోందని ఎమ్మెల్యే నాయిని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం పథకాల పేర్లు మార్చాలనే నెపంతో బీజేపీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని, అసలు సమస్యలను పరిష్కరించకుండా పేర్ల రాజకీయాలు చేయడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతోందని మండిపడ్డారు. గ్రామాల్లో పనులు నిలిచిపోవడంతో కూలీలు, పేద కుటుంబాలు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్ర శూన్యమని విమర్శించారు. ఆర్‌టీఏ చట్టం ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను కూడా బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిజంగా అభివృద్ధి జరిగితే, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూపాలని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత ఇవ్వాలని ఎమ్మెల్యే నాయిని డిమాండ్ చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు హామీ ఏమైంది?, పదేళ్లు గడిచినా మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?, హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ఈ సందర్భంగా, హన్మకొండ జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సిద్దాపురం గ్రామ సర్పంచ్ సంతోష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
