ఆర్ఎస్ఎస్ శత వసంతాల వైభవం/Centenary glory of RSS
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చరిత్రాత్మక ప్రస్థానం
సంఘ్ శక్తి, నిర్మాణ క్రమశిక్షణ ఒక చరిత్ర
ఆర్ఎస్ఎస్ ఒక చారిత్రక పాత్ర
సాంస్కృతికం నుంచి రాజకీయం వరకు
సేవ, సంస్కృతి, దేశభక్తి అనే మూడు ప్రధాన సిద్ధాంతాలతో 1925లో ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), తన 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ కేవలం 17 మంది సహచరులతో నాందీ పలికిన ఈ సంస్థ, నేడు లక్షలాది శాఖలతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటిగా నిలిచింది. విజయదశమి 2025 నుంచి విజయదశమి 2026 వరకు జరిగే ఈ శతవసంత వేడుకలు, భారతదేశ సాంస్కృతిక, సామాజిక దృశ్యాన్ని పునర్నిర్వచించే ప్లాట్‌ఫారమ్‌గా మారనున్నాయి.
వాయిస్ ఆఫ్ భారత్, ప్రత్యేక కథనం

వందేళ్ల ప్రస్థానం..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 1925లో విజయదశమి నాడు ఆర్ఎస్ఎస్ స్థాపించబడింది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం, హిందూ సమాజంలో సామాజిక ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో డాక్టర్ హెడ్గేవార్ ఈ సంస్థకు పునాది వేశారు. కేవలం హిందువులను ఏకం చేయడం, వారిలో వ్యక్తిత్వ వికాసం, చారిత్రక స్పృహను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ సంస్థ ప్రారంభంలో మోహితే వాడలో మొదలైన తొలి శాఖ (శాఖ), నేడు దేశవ్యాప్తంగా 83,000 పైగా రోజువారీ శాఖలతో, లక్షలాది మంది కార్యకర్తలతో (స్వయంసేవకులు) విస్తరించింది.

శతాబ్ది ఉత్సవాలు: కీలక కార్యక్రమాలు..
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఒక సంవత్సరం పాటు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఈ వేడుకలు సంస్థ సాంస్కృతిక వారసత్వం, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబిస్తాయి. ఈ సంవత్సరం అక్టోబర్ 2న (విజయదశమి) నాగ్‌పూర్‌లోని రేశింబాగ్ మైదానంలో సాంప్రదాయ ఉత్సవంతో శతాబ్ది వేడుకలు ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ రాష్ట్రపతి డా. రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ మార్గదర్శక ప్రసంగం చేస్తారు.దేశవ్యాప్తంగా 1.03 లక్షలకు పైగా హిందూ సమ్మేళనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విదేశీ ప్రముఖులు, వివిధ దేశాల మత పెద్దలను ఈ వేడుకలకు ఆహ్వానించారు.

భవిష్యత్తు లక్ష్యం-పంచ పరివర్తన్..
సంస్థ శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా, ‘పంచ పరివర్తన్’ (ఐదు-అంశాల పరివర్తన) అనే ఇతివృత్తంపై దృష్టి పెడుతోంది. పర్యావరణ పరిరక్షణ, సామాజిక సామరస్యం పెంపుదల, స్వయం-ఆధారిత వ్యవస్థల ప్రోత్సాహం, కుటుంబ అవగాహన బలోపేతం, మరియు పౌర బాధ్యతను పెంపొందించడం.

ఆత్మనిర్భర్ భారత్ ..
వలసవాద ఆలోచనల నుండి పూర్తిగా విముక్తి పొంది, ‘స్వదేశీ’ ఆధారిత ‘ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి కృషి చేయాలనే లక్ష్యాన్ని ఆర్ఎస్ఎస్ పునరుద్ఘాటించింది. హిందూ జాతీయవాద ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ చారిత్రకంగా ప్రధాన పాత్ర పోషించింది. మత హింసలో దాని పాత్ర కారణంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దీనిని అనేక సందర్భాల్లో నిషేధించింది. భారతదేశంలోని ప్రధాన రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీకి)కి చెందిన కొందరు ప్రముఖ నాయకులు, ముఖ్యంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీతో సహా, గతంలో లేదా ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ లో సభ్యులుగా ఉన్నారు.

