అరటిపండ్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ
సాయి రూప ట్రస్ట్ ఆధ్వర్యంలో వితరణ
వాయిస్ ఆఫ్ భారత్, వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో సాయి రూప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం భక్తులకు సేవా కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఆవరణలో అరటిపండ్లు, వాటర్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు పిల్లి బాబురావు మాట్లాడుతూ.. సమాజ సేవలో భాగంగా ట్రస్ట్ తరపున నిరంతరం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం నాటి కార్యక్రమానికి మహారాష్ట్రలోని భివండికి చెందిన దాతలు అల్లే లావణ్య – రాజు దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్థిక సహకారం అందించారని వెల్లడించారు. తమ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి దాతకు ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎద్దండి రాజు, వేముల సతీష్, బాలానగర్ బాబీ, ట్రస్ట్ ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు.
