అమెరికాలో రిలయన్స్ ‘మెగా’ రిఫైనరీ
300 బిలియన్ డాలర్లతో భారీ ప్రాజెక్ట్!
టెక్సాస్ వేదికగా ఆధునిక చమురు శుద్ధి కర్మాగారం
అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం..
సోషల్ మీడియాలో ప్రకటించిన ట్రంప్
భారత్ – అమెరికా ఆర్థిక బంధంలో సరికొత్త మైలురాయి

అంతర్జాతీయ ఇంధన రంగంలో సంచలనం నమోదైంది. అమెరికా గడ్డపై గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) నిర్మాణానికి భారతీయ దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ భాగస్వామిగా ఎంపికైంది. సుమారు 300 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 25 లక్షల కోట్లు) భారీ వ్యయంతో టెక్సాస్‌లో చేపట్టనున్న ఈ మెగా ప్రాజెక్టు వివరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన ‘ట్రూత్ సోషల్’ ఖాతా ద్వారా వెల్లడించారు.
వాయిస్ ఆఫ్ వందే భారత్, వాషింగ్టన్ –
అమెరికా ఫస్ట్ – రిలయన్స్ తో దోస్తీ
దక్షిణ టెక్సాస్‌లోని బ్రౌన్స్‌విల్లే నౌకాశ్రయం వేదికగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. “ఇది అమెరికన్ కార్మికులకు, ఇంధన వృద్ధికి మరియు టెక్సాస్ ప్రజలకు లభించిన భారీ విజయం. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఒప్పందం” అని ట్రంప్ అభివర్ణించారు. దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడంతో పాటు, పారిశ్రామిక పెట్టుబడులను విస్తరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అత్యంత ‘క్లీన్’ రిఫైనరీ
పర్యావరణ హితంగా, గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి ఇంధనాన్ని శుద్ధి చేసేలా ఈ ప్లాంట్‌ను తీర్చిదిద్దనున్నారు. ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన మరియు అత్యాధునికమైన రిఫైనరీగా ఇది నిలవనుంది. జామ్‌నగర్ వంటి ప్రపంచ స్థాయి రిఫైనరీలను నిర్వహించడంలో రిలయన్స్ కు ఉన్న అపారమైన అనుభవం, సాంకేతిక నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ట్రంప్ యంత్రాంగం ఈ చారిత్రాత్మక ఒప్పందానికి మొగ్గు చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారీ ప్రయోజనాలు:
ఉపాధి కల్పన: ఈ ప్రాజెక్టు ద్వారా అమెరికాలో వేలాది మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా పట్టును ఈ రిఫైనరీ మరింత బిగించనుంది. ఈ ఒప్పందంతో భారత్ – అమెరికా మధ్య వాణిజ్య మరియు వ్యూహాత్మక సంబంధాలు శిఖర స్థాయికి చేరనున్నాయి. ఈ డీల్ కుదుర్చుకున్నందుకు రిలయన్స్ యాజమాన్యానికి ట్రంప్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ భాగస్వామ్యం ఇరు దేశాలకు ‘విన్-విన్’ (గెలుపు) లాంటిదని పేర్కొన్నారు. 1970ల తర్వాత అమెరికాలో నిర్మిస్తున్న మొట్టమొదటి కొత్త రిఫైనరీ ఇదే కావడం విశేషం. ఈ భారీ పెట్టుబడితో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో రిలయన్స్ ప్రాభవం మరింత పెరగనుంది.
